🇮🇳

BharatTelugu News

▶f𝕏📷
క్రైమ్ & రియల్ స్టోరీస్

ఐదు రాష్ట్రాల్లో సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్

🕒 7 అక్టోబర్, 2026👁 1.5k📖 1 నిమిషాల చదవడం
షేర్ చేయండి:🟢𝕏f
ఐదు రాష్ట్రాల్లో సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్

BHARAT TELUGU NEWS

హైదరాబాద్, అక్టోబర్ 6: దక్షిణ భారతదేశంలో సైబర్ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఏజెంట్లు పోలీసుల అదుపులోకి వచ్చారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు, కేవైసీ పత్రాలు సమకూర్చడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన ప్రత్యేక బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. సుమారు రెండు వారాల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో అనుమానిత ఏజెంట్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సైబర్ నేరాలకు పాల్పడే ముఠాలకు ఈ ఏజెంట్లు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు ఏర్పాటు చేసి ఇస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఖాతాల కోసం అవసరమైన కేవైసీ పత్రాలను కూడా సమకూర్చినట్లు గుర్తించారు. ఈ ఖాతాలను సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బును బదిలీ చేసేందుకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు.

సోదాల సందర్భంగా నిందితుల వద్ద నుంచి పెద్ద సంఖ్యలో డెబిట్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లు, మ్యూల్ ఖాతాలకు సంబంధించిన ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన సైబర్ నేరాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పలు రాష్ట్రాల్లో జరిగిన ఈ సోదాల్లో అదుపులోకి తీసుకున్న నిందితులను తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మంగళవారం ట్రాన్సిట్ వారెంట్‌పై వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు, సైబర్ నేరగాళ్లతో ఏజెంట్లకు ఉన్న సంబంధాలు, మ్యూల్ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత సైబర్ నేరాల నెట్‌వర్క్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

షేర్ చేయండి:🟢𝕏f

సంబంధిత వార్తలు

వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మీరే రాయండి!