🇮🇳

BharatTelugu News

▶f𝕏📷
ఆంధ్ర & తెలంగాణ

జలుబు.. దగ్గు.. జ్వరం మొదలవుతున్నాయి

🕒 29 రోజుల క్రితం👁 1.9k📖 1 నిమిషాల చదవడం
షేర్ చేయండి:🟢𝕏f
 జలుబు.. దగ్గు.. జ్వరం మొదలవుతున్నాయి

BHARAT TELUGU NEWS Publish Date - Oct 07 , 2026 | 03 :00 PM

కరీంనగర్: కరీంనగర్‌ జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పలువురు జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా బాధితులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న ఇన్‌పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

వర్షాల తర్వాత ఒక్కసారిగా ఎండలు పెరగడం కూడా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారిలో కొందరికి డెంగీ లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 47 డెంగీ కేసులు నమోదయ్యాయి.

పారిశుధ్య లోపాలతో పెరుగుతున్న దోమలు

జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం సమస్యగా మారింది. డ్రైనేజీలు పొంగిపొర్లడం, ఖాళీ స్థలాల్లో మురుగు నీరు నిల్వ ఉండటం, పాత టైర్లు, కొబ్బరి బొండాల్లో నీరు నిలవడం వంటి కారణాలతో దోమల వ్యాప్తి పెరుగుతోంది. దీంతో డెంగీ, ఇతర సీజనల్‌ వ్యాధులపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.

వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న వారిలో దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చిన తర్వాత ఇతర కుటుంబ సభ్యులకు కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు.

ఇంటింటి జ్వర సర్వే లేకపోవడంపై ఆందోళన

సీజనల్‌ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు మరింత పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిర్వహించిన విధంగా ఇంటింటి జ్వర సర్వే చేపట్టకపోవడం, వ్యాధులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

కాగా, గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు తగ్గినప్పటికీ సాధారణ జ్వరాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య మాత్రం పెరిగినట్లు సమాచారం.

మూడేళ్లలో డెంగీ కేసులు

  • 2024: 186 కేసులు
  • 2025: 97 కేసులు
  • 2026: 47 కేసులు
షేర్ చేయండి:🟢𝕏f

సంబంధిత వార్తలు

వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మీరే రాయండి!